వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో ఆక్వా రంగం సంక్షోభానికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని, ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఫీడ్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని. కరెంటు సబ్సిడీ తొలగించడం, ఫీడ్ ధరలను రెండుసార్లు పెంచడం వల్ల రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, ఎగుమతుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫీడ్ ధరలు తగ్గించాలని వైసీపీ పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ అంశంపై ఆక్వా రైతులు అనేకసార్లు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం సిండికేట్‌గా వ్యవహరిస్తున్న వ్యాపారులకే మద్దతు ఇస్తోందని విమర్శిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఆక్వా రైతులు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించినట్లు వైసీపీ చెబుతోంది. రైతుల తరఫున ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు గడువు కూడా ఇచ్చినట్లు పేర్కొంటోంది. అనంతరం ప్రభుత్వం అత్యవసరంగా ఏపీఎస్‌డీఏ సమావేశం నిర్వహించినప్పటికీ, ఫీడ్ ధరను రూ.4 తగ్గించాలని కోరగా కేవలం రూ.2 మాత్రమే తగ్గించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే రూ.14 వరకు పెంచిన ధరల్లో కేవలం రూ.2 తగ్గించడం వల్ల రైతులకు ఎలాంటి ఉపశమనం కలగలేదని పార్టీ విమర్శిస్తోంది.
ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ఆక్వా రైతులు “క్రాప్ హాలిడే” ప్రకటించే ఆలోచనలో ఉన్నారని వైసీపీ పేర్కొంటోంది. కూటమి ప్రభుత్వ విధానాల వల్లే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ, ఈ అంశంపై భీమవరంలో జగన్ నిర్వహించనున్న సమావేశం రాజకీయంగానూ, రైతాంగ పరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.






