తిరుపతి డ్రగ్స్ కేసు (Tirupati Drugs Case) ఆధ్యాత్మిక నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా కేసులో రేణిగుంట పోలీసులు (Renigunta Police) చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన 3 మంది నిందితుల్లో ఒకరు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి (TTD Employee) కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుడిని తిరుపతిలోని (Tirupati) గోవిందరాజస్వామి (Govindaraja Swamy) ఆలయ అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్‌గా (Rahul Yadav) పోలీసులు గుర్తించారు. పవిత్ర సంస్థలో ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడం భక్తులు, స్థానికులను షాక్‌కు గురి చేసింది.
ఈ నెల 10వ తేదీన రేణిగుంట పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 3 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 63 గ్రాముల మెథాంఫెటమైన్ (మెత్) (Methamphetamine) స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో టీటీడీ ఉద్యోగితో పాటు ఓ ఇంజినీరింగ్ కళాశాల ఉద్యోగి (Engineering College Employee) కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
టీటీడీ ఉద్యోగి అరెస్ట్ కావడంతో అతనితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక మరెవరు ఉన్నారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తిరుపతికి చేరుతున్నాయనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
డ్రగ్స్(Drugs), గంజాయి (Marijuana) సంస్కృతిని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నగరవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని బయో చెక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారిని గుర్తించి నెట్‌వర్క్‌ను (Network) పూర్తిగా ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.







