పోలవరం (Polavaram) జిల్లా ఎటపాక (Etapaka) మండలం గొల్లగూడెం (Gollagudem) సమీపంలోని గోదావరి నదిలో (Godavari River) జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చేపల వేట కోసం నదిలోకి వెళ్లిన 5 మంది గిరిజన మత్స్యకారులు (Tribal Fishermen) నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో శోకసంద్రం నెలకొంది.
స్థానిక మత్స్యకారులు శనివారం గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు 5 మంది నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police), స్థానిక మత్స్యకారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత 2 మృతదేహాలు లభించగా, అనంతరం మిగిలిన 3 మంది మృతదేహాలను కూడా వెలికితీశారు.
మృతుల్లో రమేష్ ఊకె (Ramesh Ooke) (38), భారతి తుర్రం (Bharathi Turram) (40), లక్ష్మి ఉయిక (Lakshmi Uyika) (37), ఉయిక సుశీల (Uyika Sushila) (37), బాలరాజు బసిపోయిన (Balaraju Basipoyina) (40) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 5 మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ దుర్ఘటనతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వర్షాకాలంలో చేపల వేట లేదా ఇతర అవసరాల కోసం నదులు, చెరువులు వంటి నీటి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి:
ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జరిగిన ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.







