ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం(Central Government), నీతి ఆయోగ్ (NITI Aayog) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు పార్లమెంట్ సాక్షిగా డొల్లగా తేలిపోయాయని విమర్శకులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు (Investments) తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వచ్చిన ప్రాజెక్టుల విలువ కేవలం రూ.6,962 కోట్లు మాత్రమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasada) లోక్‌సభలో (Lok Sabha) వెల్లడించారు. కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే రాగా, అందులో రెండే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా లభిస్తాయని అంచనా వేసిన 22,167 ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో ఏర్పడేవే తప్ప, ఇప్పటికే కల్పించినవి కావు.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ (Coalition Government) పారిశ్రామిక విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పెట్టుబడుల కంటే, రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పెట్టుబడుల విలువే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా రూ.6,215 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
వెనక్కి వెళ్లిన ప్రధాన పెట్టుబడులు చూస్తే హిందుస్థాన్ కోకాకోలా (Hindustan Coca-Cola) బెవరేజెస్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన రూ.1,200 కోట్ల యూనిట్ ప్రతిపాదనను ఉపసంహరించుకుని తెలంగాణకు (Telangana) తరలిపోయింది. ఆజాద్ ఇండియా మొబిలిటీ (Azad India Mobility) శ్రీసత్యసాయి జిల్లాలో రూ.1,046 కోట్ల గ్రీన్ ప్రాజెక్టును (Green Project) విరమించుకోవడమే కాకుండా, చెల్లించిన డిపాజిట్‌ను వడ్డీతో సహా వెనక్కి తీసుకుంది. జిన్‌ఫ్రా ప్రెసిషన్స్ (Jinfra Precisions) అనంతపురం జిల్లాలో రూ.1,150 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనను రద్దు చేసుకుంది. జ్యూపిటర్ రెన్యూవబుల్ ఎనర్జీ అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేసి, రూ.2,700 కోట్ల పెట్టుబడి నుంచి తప్పుకుంది. ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖపట్నంలో ప్రతిపాదించిన రూ.119.18 కోట్ల ఐటీ క్యాంపస్ ప్రాజెక్టును విరమించుకుంది.
గతంలో వరుసగా మూడేళ్ల పాటు దేశంలోనే బిజినెస్ ర్యాంకింగ్ లో నంబర్-1 స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. నీతి ఆయోగ్ (NITI Aayog) విడుదల చేసిన “ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026”(Investment Friendly Index 2026) ప్రకారం, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు ఏపీ కంటే ముందున్నాయి.
నీతి ఆయోగ్ నివేదిక, పారిశ్రామిక వర్గాల విశ్లేషణ ప్రకారం పెట్టుబడులు వెనక్కి వెళ్లడానికి ప్రధాన కారణాలుగా రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ వేధింపులు, “రెడ్ బుక్”(Red Book) తరహా పాలన పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శకులు అంటున్నారు. కూటమి నేతల వాటాల వసూళ్లు, కమీషన్ల కోసం వేధింపులు భరించలేక కంపెనీలు రాష్ట్రాన్ని విడిచిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకాకోలా వంటి సంస్థలు వసూళ్ల అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశాయని కూడా గుర్తుచేస్తున్నారు.
అలాగే పారిశ్రామిక విధానాల అమలులో వైఫల్యం, రాయితీలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం దెబ్బతిందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో(GSDP) 35 శాతానికి చేరుకోవడం కూడా పారిశ్రామిక వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నుంచి “ఫాల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”(Fall of Doing Business) దిశగా పయనిస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park), పారిశ్రామిక కారిడార్లు వంటి ప్రాజెక్టులే ఇప్పుడు రాష్ట్రానికి ప్రధాన ఆధారంగా నిలిచాయని, కొత్తగా వస్తున్న పెట్టుబడులు నామమాత్రంగానే ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. మొత్తం చూస్తే, కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాల కారణంగా గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ రూ.6,962 కోట్లే కాగా, అదే కాలంలో ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా రూ.6,215 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత వెనుకపడిపోయిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి అని పారిశ్రామిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.








