కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాల కోసం దేవాలయ నిధులను మళ్లిస్తున్నదన్న అంశంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకలను ప్రభుత్వ పథకాల కోసం వినియోగించడం ధార్మిక విలువలకే కాకుండా, గతంలో పలు ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నంబర్ 1243 (తేదీ: జూలై 19, 2026) ద్వారా రూ. 26.03 కోట్ల దేవాదాయ శాఖ నిధులను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ‘తల్లికి వందనం’ పథకానికి విడుదల చేయడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్రస్థాయిలో మండిపడింది.
దేవాలయ నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలు, సనాతన ధర్మ ప్రచారం, వేద విద్య వంటి అవసరాలకే వినియోగించాలే తప్ప, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించకూడదని విహెచ్పి క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా భక్తులందరూ దేవాలయ హుండీల్లో సమర్పించే కానుకలను కేవలం ఒక వర్గానికి లేదా ప్రభుత్వ పథకాలకు కేటాయించడం అన్యాయమని వారు వాదిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ప్రభుత్వాలు దేవాలయ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడంపై గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పుల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రామ రవికుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, దేవాలయ నిధులతో పెళ్లి మండపాలు నిర్మించడం లేదా ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది.
“దేవాలయ నిధులు ప్రజల సొమ్ము లేదా ప్రభుత్వ నిధులు కావు” అని కోర్టు స్పష్టం చేసింది. ఆ నిధులు చట్టపరంగా దేవుడికి చెందుతాయని, ప్రభుత్వం వాటికి కేవలం సంరక్షకురాలిగా మాత్రమే వ్యవహరించాలనే అభిప్రాయాన్ని వెల్లడించింది. భక్తులు సమర్పించే నగదు, నగలు, ఆస్తులు కేవలం ఆలయ నిర్వహణ, ధార్మిక కార్యక్రమాల కోసమే వినియోగించాలే తప్ప, లాభాపేక్షతో కూడిన పనులకు లేదా ప్రభుత్వ పథకాలకు వినియోగించకూడదని కోర్టు తేల్చిచెప్పింది.
గతంలో సుప్రీంకోర్టు కూడా భక్తుల సొమ్మును పెళ్లి మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి నిర్మాణాలకు వినియోగించడం “ధార్మిక ప్రయోజనం” పరిధిలోకి రాదని పేర్కొంది. భక్తులు దేవుడిపై భక్తితో కానుకలు సమర్పిస్తారు గానీ, ప్రభుత్వ లేదా వాణిజ్య అవసరాల కోసం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు దేవాలయ మిగులు నిధులను వినియోగించాలనుకుంటే కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని కోర్టులు పేర్కొన్నాయి. బహిరంగంగా అభ్యంతరాలు కోరడం, పారదర్శక విచారణ నిర్వహించడం వంటి ప్రక్రియలను అనుసరించకుండా నేరుగా నిధులను మళ్లించడం చట్టవిరుద్ధమని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి.
ఉన్నత న్యాయస్థానాలు దేవాలయ నిధులను ప్రభుత్వ పథకాలకు లేదా వాణిజ్య అవసరాలకు వినియోగించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కోసం దేవాలయ నిధులను మళ్లించడం న్యాయస్థానాల తీర్పులకు, ధార్మిక విలువలకు విరుద్ధమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహేతుకమా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.






