ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు (Government Schools), గురుకులాలు(Gurukul Schools), సంక్షేమ వసతి గృహాలు (Welfare Residential Hostels), అంగన్వాడీలు, కళాశాల హాస్టళ్లలో(College Hostels) కలుషిత ఆహారం, ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డొక్కా సీతమ్మ (Dokka Seethamma) పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధికారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ పరిస్థితికి అద్ధం పట్టేలా నిలిచిన ఘటనల్లో ఒకటి అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బీసీ బాలికల గురుకుల హాస్టల్‌ను సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా, ఆమె ప్లేటులోనే బొద్దింక కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటన ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతపై తీవ్ర సందేహాలను రేకెత్తించింది.
నిన్నటిరోజున పోలవరం (Polavaram) జిల్లా సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్నం మిగిలిన పప్పును నిభందనలకు విరుద్దంగా రాత్రి కూడా వడ్డించడంతో 41 మంది విద్యార్థినులు(Students) అస్వస్థతకు గురయ్యారు. అదే రోజు అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో మిగిలిపోయిన కూరలను రాత్రికి మళ్లీ వడ్డించడంతో మరో 30 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. మొత్తం 71 మంది విద్యార్థినులు ఒకేరోజు అనారోగ్యానికి గురికావడం తీవ్ర ఆందోళన కలిగించింది.
ఇవి ఒక్కటే కాకుండా 2024 నుంచి 2026 వరకు కూటమి పాలనలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి. నాయుడుపేట గురుకులంలో 121 మంది విద్యార్థులు, నూజివీడు ట్రిపుల్ ఐటీలో వెయ్యికి పైగా విద్యార్థులు, గుత్తి, పెదబయలు, శ్రీకాళహస్తి, కురుపాం, మారేడుమిల్లి, కడప, పాణ్యం తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు విద్యా వ్యవస్థలో ఆహార భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి.
కొన్ని చోట్ల కుళ్లిన గుడ్లు, మరికొన్ని చోట్ల పాచిపోయిన పప్పు, నిల్వ ఉంచిన కూరలు, ఉడకని ఆహారం, కలుషిత నీరు, నాసిరకం పదార్థాలే కారణమని ప్రాథమిక విచారణల్లో వెల్లడైంది. పలు సందర్భాల్లో తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా, అధికారులు విచారణలు ప్రకటించినప్పటికీ ఘటనలు మాత్రం ఆగడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన భోజనం అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలి పేరును కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, ఆమె సేవాస్ఫూర్తికి తగ్గట్టుగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.







