---Advertisement---

మూతపడుతున్న పాఠశాలలు.. తగ్గిపోతున్న విద్యార్థులు.. ఏపీలో ఆందోళనకరంగా మారుతున్న విద్యా వ్యవస్థ

July 27, 2026

Summarize with AI

---Advertisement---

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. 2024–25 నుంచి 2025–26 విద్యా సంవత్సరాల మధ్య రాష్ట్రంలో 664 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కూడా గణనీయంగా తగ్గింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల నమోదు 87.42 లక్షలు ఉండగా, 2025–26 నాటికి అది 84.37 లక్షలకు పడిపోయింది. అంటే రెండేళ్ల వ్యవధిలో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మరోవైపు ప్రైవేట్ పాఠశాలల సంఖ్య, వాటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2023–24లో రాష్ట్రంలో 15,232 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 45,53,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2025–26 నాటికి ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,710కు పెరగగా, విద్యార్థుల సంఖ్య 48,40,296కు చేరింది. అంటే రెండేళ్లలో 478 ప్రైవేట్ పాఠశాలలు పెరగడంతో పాటు 2,86,916 మంది అదనపు విద్యార్థులు వాటిలో చేరారు.

ఒకవైపు ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర విద్యారంగం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మరోవైపు ఈ గణాంకాలు మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుండగా, ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థులు మళ్లడం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో లోపాలని స్పష్టం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విమర్శకుల అభిప్రాయం ప్రకారం, గతంలో అమలైన నాణ్యమైన గోరుముద్ద పథకం బలహీనపడటంతో పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలాగే సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్ కార్యక్రమం నిలిపివేయడం, నాడు–నేడు పాఠశాలల అభివృద్ధి పనులు నిలిచిపోవడం, అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా అమలు చేస్తున్నప్పటికీ తగిన నిధులు కేటాయించడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా రాష్ట్ర విద్యా రంగం తిరోగమన దిశగా పయనిస్తోందని, దీనిపై ప్రభుత్వం సమగ్రంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment