ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది (పీఏలు, పీఆర్వోలు) వ్యవహారశైలి ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం పైకి తాము అభివృద్ధి, సంక్షేమం పేరుతో పాలన సాగిస్తున్నామని చెబుతున్నప్పటికీ అవన్నీ మభ్యపెట్టే మాటలని, క్షేత్రస్థాయిలో కొందరు పీఏలు, పీఆర్వోలపై లంచాలు, అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం, మహిళలపై వేధింపుల వంటి ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రభుత్వ పరిపాలనా తీరుకు నిదర్శనం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్‌పై బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం లంచాలు డిమాండ్ చేయడం, సెటిల్‌మెంట్లు నిర్వహించడం వంటి ఆరోపణలు వచ్చాయి. రిటైల్ మద్యం అవుట్‌లెట్లలో వాటాల కోసం లైసెన్స్ హోల్డర్లపై ఒత్తిడి తేవడం, తిరుమల దర్శన సిఫార్సు లేఖలను విక్రయించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఆయనను తప్పక వత్తిడి మేరకు బాధ్యతల నుంచి తప్పించారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద పీఆర్వోగా పనిచేసిన అనిల్ తేజ కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆడియోలు బయటకు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పక తొలగించారు. అదనంగా, సుమారు 18 నెలల పాటు విధులకు సరిగా హాజరుకాకుండానే రూ.16.20 లక్షల ప్రజాధనాన్ని జీతంగా పొందారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్‌పై కారుణ్య నియామకం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకోవడం, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. అయితే ఈ కేసులో బాధితురాలినే అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పీఏ రాసూరి శశిదేవ్‌పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. బదిలీలు, ఇసుక, రేషన్ బియ్యం వంటి వ్యవహారాల్లో కమీషన్లు వసూలు చేశారనే విమర్శలు వినిపించాయి. ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో భారీగా అక్రమ సంపాదన చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను వత్తిడి మేరకు పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పీఏ వాహిద్‌పై ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒంటరి మహిళలను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక బాధితురాలి కుటుంబ సభ్యుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రజా ఒత్తిడి నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబం జోక్యం చేసుకుని ఆయనను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.
ఈ ఘటనలన్నీ చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగంలో కొందరు పీఏలు, పీఆర్వోలు విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు మరింత బలపడుతున్నాయని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాలపై బాధ్యత వహించాలని, ఇలాంటి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగి సమయం వచ్చిన రోజు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







