తనకు వాచ్ లేదని, ఉంగరం లేదని, తాను నిరుపేదనని తరచూ చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి తాజాగా విడుదలైన ఏడీఆర్ 2026 నివేదిక ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. ఏడీఆర్ 2026 నివేదిక ప్రకారం, చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.931 కోట్లకు పైగా ఉంది. దీంతో దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ రూ.1,413 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రూ.648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు.
క్రిమినల్ కేసుల పరంగా కూడా చంద్రబాబు నాయుడి పేరు ఈ నివేదికలో ప్రస్తావనకు వచ్చింది. ఆయనపై మొత్తం 19 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో కొన్ని తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మరియు డి.కె. శివకుమార్ తలా 19 కేసులతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ఇదే సంస్థ గతంలో విడుదల చేసిన మరో నివేదికలో, దేశంలోనే అత్యధిక శాతం క్రిమినల్ కేసులు ఉన్న మంత్రులను కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచినట్లు పేర్కొంది. టీడీపీకి చెందిన 23 మంది మంత్రుల్లో 22 మంది (96 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో వెల్లడించినట్లు ఆ నివేదిక పేర్కొంది.
అలాగే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన బిలియనీర్ మంత్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర కేబినెట్లోని 25 మంది మంత్రుల్లో ఆరుగురు బిలియనీర్లు కాగా, వారిలో ఐదుగురు టీడీపీకి చెందినవారే. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రూ.5,705 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక మంత్రిగా నమోదయ్యారు.
ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాలో చంద్రబాబు నాయుడు దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రాష్ట్రం అప్పుల భారం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తుండగా, మరోవైపు ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆస్తుల వివరాలు చర్చకు రావడం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత ఆర్థిక పురోగతిపైనే ఎక్కువ దృష్టి పెట్టారా అనే విమర్శలు ప్రతిపక్షాలతో పాటు పలు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.







