అమరావతి రాజధాని నిర్మాణంపై (Amaravati Capital Construction) రాజకీయ చర్చ మరోసారి వేడెక్కుతోంది. మొదట రాజధాని నిర్మాణం కోసం సుమారు 33 వేల ఎకరాల భూమిని సేకరించి, జీవో 141 ప్రకారం 29 గ్రామాల పరిధిలోని 217.23 చదరపు కిలోమీటర్లలో ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చేస్తామని నాటి టీడీపీ ప్రభుత్వం (TDP Government) ప్రకటించింది. ఆ తర్వాత రాజధాని విస్తరణకు మరింత భూమి అవసరమని చెబుతూ రెండో విడత భూసేకరణ ప్రతిపాదనలు కూడా 2024 తరువాత వచ్చాయి. అయితే, ఈ 12 ఏళ్ల కాలంలో ఆ 29 గ్రామాల పరిధిని దాటి విజయవాడ లేదా గుంటూరు నగరాల్లో రాజధాని పేరుతో గణనీయమైన ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విజయవాడ(Vijayawada)–గుంటూరు (Guntur)–మచిలీపట్నంను(Machilipatnam) అనుసంధానించే “రాజధాని కారిడార్”(Capital Corridor) ఆలోచనను ప్రతిపాదించారు. మొదట ఈ ప్రతిపాదనను విమర్శించిన అధికార పక్ష నేతలు, ఇప్పుడు రాజధాని అనేది కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం కాదని, విజయవాడ–గుంటూరు కూడా రాజధాని పరిధిలో భాగమేనని చెబుతున్నారని విమర్శకులు గుర్తు చేస్తున్నారు.
అలా అయితే, ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన భూములు ఉన్న మంగళగిరి వంటి ప్రాంతాల్లో రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అధికారుల నివాసాలు, మంత్రుల నివాసాలు వంటి కీలక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే సరిపోతుందనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఈ నిర్మాణాలన్నీ కలిపినా సుమారు 500 ఎకరాల్లో పూర్తవుతాయని, అలాంటప్పుడు లక్షల కోట్ల రూపాయలతో 29 గ్రామాల పరిధిలో భారీ రియల్ ఎస్టేట్ ఆధారిత అభివృద్ధి అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ, గుంటూరు నగరాలను కూడా రాజధాని భాగంగా ప్రకటిస్తే, పెట్టుబడిదారులు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లోనే నివాసాలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో రాజధాని గ్రామాల్లో నిర్మించే నివాస ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో డిమాండ్ ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల భూములు ఇచ్చిన రైతులకే(Farmers) నష్టం జరిగే ప్రమాదం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అమరావతి అభివృద్ధి పేరుతో గతంలో ప్రకటించిన అనేక ప్రాజెక్టులు కూడా పూర్తిగా 29 గ్రామాల పరిధిలోనే కేంద్రీకృతమయ్యాయి. రాయపూడి–ఉద్దండరాయునిపాలెం సమీపంలో లండన్ ఐ తరహా జెయింట్ వీల్, శాఖమూరులో ఎమ్యూజ్మెంట్ పార్క్, అడ్వెంచర్ పార్క్, ఎకో టూరిజం రిసార్టులు, అమెజాన్ అడవులను తలపించే ఫారెస్ట్ ప్రాజెక్ట్, అమరావతిని కూల్ సిటీగా మార్చడం, దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడం, ఇస్తాంబుల్, షాంఘై, టోక్యో స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని చేసిన ప్రకటనలన్నీ కూడా ఇదే పరిధిలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదని, విజయవాడ–గుంటూరు మొత్తం రాజధాని ప్రాంతమనే వాదనను ముందుకు తీసుకురావడం వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే చర్చ మొదలైంది. జగన్ ప్రతిపాదించిన రాజధాని కారిడార్ ఆలోచనకు ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోందనే సర్వేలు రావడంతోనే అధికార పక్షం తన వాదనను మార్చుకుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు, ఖర్చులు ప్రధానంగా 29 గ్రామాలకే పరిమితమైన నేపథ్యంలో, ఇప్పుడు మొత్తం విజయవాడ–గుంటూరు కూడా రాజధానిలో భాగమేనని ప్రజలను నమ్మించడం అంత సులభం కాదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.







