మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రమాదవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి సీదిరి కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.
అంపోలు జైలులో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌కు ములాఖత్‌కు అనుమతి లభించకపోవడంతో, జైలు వెలుపలే ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సీదిరి కుమారుడు వైద్య విద్య చదవాలనే లక్ష్యంతో ఉన్న 18 ఏళ్ల విద్యార్థి అని, అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ఉద్దేశపూర్వక హత్యగా చిత్రీకరించడం ద్వారా అతని భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని జగన్ అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని కాపాడేందుకు 108కు సమాచారం ఇవ్వడం, సీపీఆర్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారని, అయినప్పటికీ కేసును మలుపు తిప్పారని ఆరోపించారు.
బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడైన సీదిరి అప్పలరాజును రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకున్నారని, ఒకే తరహా ఘటనల్లో అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, ప్రతిపక్ష నేతలకు మరో న్యాయం జరుగుతోందని జగన్ విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి సహాయం చేయాల్సిందిపోయి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని అన్నారు.
మత్స్యకారులు, బీసీలు, యాదవుల సమస్యలను కూడా ప్రస్తావించిన జగన్, ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో పాటు ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సీదిరి అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, జగన్ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో కార్యక్రమం ఆలస్యమైంది. సాయంత్రం 5 గంటల తర్వాత జైలులో ములాఖత్‌కు అనుమతి కోరగా, జైలు నిబంధనల ప్రకారం 5 గంటలలోపే మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో జైలులో భేటీ సాధ్యంకాకపోవడంతో జగన్ జైలు వెలుపలే సీదిరి కుటుంబ సభ్యులను కలుసుకుని, అనంతరం మీడియాతో మాట్లాడారు.







