కర్నూలు జిల్లా (Kurnool District) చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్త గిరి (Giri) ఇంటిపై టీడీపీ (TDP) వర్గీయులు దాడి చేశారనే ఆరోపణలు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. గిరిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే(YSRCP MLA) వీరుపాక్షి (Veerupakshi) బాధితుడిని పరామర్శించేందుకు నేమకల్లు గ్రామానికి వెళ్లగా, అక్కడ మరోసారి ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములకు (Sriramulu) గాయాలయ్యాయని, పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా గాయపడినట్లు పేర్కొంటున్నారు. అనంతరం దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వీరుపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. అయితే, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యేపైనే దురుసుగా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.
ఈ ఘటన అనంతరం అర్ధరాత్రి సుమారు 2:45 గంటలకు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన పోలీసులు తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే వీరుపాక్షిని అరెస్ట్ చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను (Chandrasekhar) కూడా అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. తప్పు చేసిన వారిని వదిలేసి బాధితులను పరామర్శించిన వారిపైనే చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.







