ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day) సందర్భంగా సరదాగా గడపాలని వెళ్లిన 7 మంది స్నేహితుల (Friends) బృందంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని (Visakhapatnam) పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో (Old Gangavaram Beach) సముద్ర అలలు ఇద్దరిని లోనికి లాక్కెళ్లాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు(New Port Police), బీచ్ లైఫ్‌గార్డులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 4 మంది యువతులు, 3 మంది యువకులు కలిసి మొత్తం 7 మంది స్నేహితులు (Friends) పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. బీచ్ వద్ద అందరూ కలిసి ఫొటోలు(Photos) దిగుతుండగా జాలరిపేటకు చెందిన 18 ఏళ్ల నీతూ (Neethu) ప్రమాదవశాత్తు సముద్ర అలల్లో కొట్టుకుపోయింది. ఇది గమనించిన పెందుర్తికి చెందిన దామోదర్ (Damodar) ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను కాపాడేందుకు సముద్రంలోకి దూకాడు. అయితే అలలు ఉధృతంగా ఉండటంతో అతడు కూడా సముద్రంలో గల్లంతయ్యాడు.
గల్లంతైన నీతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం (Intermediate Second Year) చదువుతున్నట్లు సమాచారం. మరోవైపు దామోదర్‌కు మరికొద్ది రోజుల్లో కనకమహాలక్ష్మి (Kanaka Mahalakshmi) అనే యువతితో వివాహం (Marriage) జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు బీచ్ లైఫ్‌గార్డులతో కలిసి సముద్రంలో గల్లంతైన ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలమైన అలలు, ప్రతికూల సముద్ర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ, వారిని గుర్తించేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.







