తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరోసారి మాటల యుద్ధం హీట్ పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంజినీరింగ్ విద్యార్థులు (Engineering Students), ఇంజినీర్లు(Engineers), అధ్యాపకులను (Faculty) “క్రిమినల్ వేస్ట్” (Criminal Waste) అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) బహిరంగ లేఖ రాశారు. సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. దీనిపై స్పందించి క్షమాపణ చెప్పించే బాధ్యత రాహుల్ గాంధీదేనని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఇంజినీర్లు (Indian Engineers) అగ్రశ్రేణి సంస్థలను నడిపిస్తూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అంతరిక్ష రంగం నుంచి సాంకేతిక విప్లవం వరకు ప్రతి రంగంలో భారతీయ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు, అధ్యాపకులను “క్రిమినల్ వేస్ట్” అని పిలవడం అత్యంత బాధాకరమని, ఇది లక్షలాది మంది యువతను అవమానించినట్టేనని మండిపడ్డారు.
దేశ రక్షణ, సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజినీర్లను అవమానించడం కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆ వ్యాఖ్యలకు ఆయన మద్దతుగా భావించాల్సి వస్తుందని అన్నారు. వెంటనే రాహుల్ గాంధీ విద్యార్థులు, అధ్యాపకులకు ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేత కూడా బహిరంగంగా క్షమాపణ (Apology) చెప్పించాలని డిమాండ్ చేశారు.
గతంలో కూడా రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను (University Students) “బీరు బిర్యానీ బ్యాచ్”(Beer Biryani Batch) అంటూ అవమానించారని కేటీఆర్ గుర్తు చేశారు. తనను ప్రశ్నించే వారందరినీ కించపరిచేలా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
యువతే రేపటి భారతదేశ భవిష్యత్తు అని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. విద్యార్థులు, యువతతో విభేదిస్తే దాని ఫలితాలు కాంగ్రెస్ పార్టీ గతంలోనే చూసిందని పేర్కొన్నారు. 1. ఎమర్జెన్సీ కాలంలో. 2. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత కాంగ్రెస్‌కు గట్టి సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని, యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కే అసలు “క్రిమినల్ వేస్ట్” అనే పదం సరిపోతుందని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ యువత ఈ వ్యాఖ్యలకు తగిన సమాధానం ఇస్తుందని కేటీఆర్ తన లేఖలో హెచ్చరించారు.






