టీటీడీ (TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) రాష్ట్రంలో అవినీతి (Corruption) భారీ స్థాయిలో జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)పాత్ర ఉందని ఆయన విమర్శించారు. తిరుపతిలోని స్విమ్స్(SVIMS), బర్డ్స్ (BIRRD) ఆస్పత్రుల్లో ప్రాణరక్షక మందుల కొనుగోళ్లపై స్పందించిన భూమన, కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్ర ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం (Red Book Constitution) కారణంగానే రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగిపోయిందని భూమన విమర్శించారు. చివరకు ధార్మిక సంస్థ అయిన టీటీడీని(TTD) కూడా వదలకుండా అక్రమాలకు కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు.
టీటీడీని పూర్తిగా పట్టి పీడిస్తున్నారని భూమన ఆరోపించారు. మందుల సరఫరా నుంచి శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాల కొనుగోలు వరకు భారీ అవినీతి జరుగుతోందన్నారు. తిరుపతిలోని బర్డ్స్, స్విమ్స్ ఆస్పత్రుల్లో ఉన్న భారీ యంత్రాలకు సంబంధించిన టెండర్లలో కూడా గోల్‌మాల్ జరుగుతోందని ఆరోపించారు.
ఎల్1 టెండర్ల (L1 Tenders) పేరుతో అక్రమాలు సాగుతున్నాయని, పెద్దల సమక్షంలోనే భారీ అవినీతి జరుగుతోందని భూమన అన్నారు. కొన్ని కంపెనీలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి, టీటీడీకి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.







