ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఆరోగ్యశ్రీ (Aarogyasri Health Scheme) సేవల నిర్వహణపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (APSHA) రాష్ట్ర ప్రభుత్వానికి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు (Dr. NTR Vaidya Seva Trust) లేఖ ద్వారా తాము ఎదుర్కుంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను వివరించింది.
అసోసియేషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం గతంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (One-Time Settlement) కింద రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని, అనంతరం ప్రతి నెల సుమారు రూ.170 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొంది. అయితే ఆ హామీలు అమలు కాలేదని, ఫలితంగా నెట్‌వర్క్ ఆస్పత్రులు (Network Hospitals) తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది.
ప్రభుత్వం నుంచి బకాయిలు అందకపోవడంతో వైద్య సిబ్బందికి జీతాలు(Salaries) చెల్లించడం, మందులు(Medicines), సర్జికల్స్(Surgical Supplies), ఇతర వినియోగ వస్తువులు కొనుగోలు చేయడం కూడా కష్టంగా మారిందని లేఖలో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 320కు పైగా ఆస్పత్రులు పాల్గొన్న సమావేశంలో ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైందని తెలిపింది.
అలాగే, హెచ్‌పీఆర్ (HPR) నమోదు పూర్తి చేయకపోతే ఆగస్టు 10, 2026 నుంచి ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేస్తామని ట్రస్ట్ నుంచి సమాచారం అందిందని, పెండింగ్ బకాయిలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చర్యలు రోగుల సేవలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ ఐదు ప్రధాన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కొరింది. తక్షణమే రూ.600 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని. నెలవారీ చెల్లింపులను క్రమబద్ధంగా కొనసాగించాలని. మిగిలిన బకాయిల విడుదలకు స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకటించాలని. సమస్యల పరిష్కారం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని. పెండింగ్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు హెచ్‌పీఆర్‌తో అనుసంధానించిన ప్రీ-ఆథరైజేషన్ నిలుపుదల నిర్ణయాన్ని అమలు చేయరాదని కోరింది.
ఆషా హెచ్చరికల ప్రకారం, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు పొందుతున్న లక్షలాది మంది రోగులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటీకే ప్రజారోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం ఈ తాజా డిమాండ్లపై ఎలా స్పందిస్తుంది అనేది ఆశక్తికర అంశంగా మారింది.







