---Advertisement---

పవన్‌ను చూపి సామాజికవర్గాన్ని విస్మరిస్తున్నారంటూ కూటమిలో కాపుల అసంతృప్తి జ్వాలలు?

August 4, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కాపు సామాజిక (Kapu Community) వర్గంలో కూటమి ప్రభుత్వంపై (Alliance Government) అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు (Promises) అమలు కాలేదని, కాపు సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాధాన్యం, నామినేటెడ్ పదవుల్లో (Nominated Posts) సరైన భాగస్వామ్యం కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పలువురు కాపు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో(YSRCP) చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాపు జేఏసీ (JAC) రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్థన (Chandu Janardhan) మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గాన్ని వినియోగించుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు (Gudapati Srinivasa Rao) (జీఎస్) మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉన్నారనే కారణంతో కాపు సమాజం మొత్తాన్ని టీడీపీ(TDP) నిర్లక్ష్యం చేస్తోంది” అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, మిగతా కాపు నాయకత్వాన్ని పక్కన పెట్టారని ఆయన విమర్శించారు.

జనసేన నాయకుడు దాసరి రాము కూడా అధికార భాగస్వామ్యం, టికెట్ల కేటాయింపు, కాపు సమస్యలపై పార్టీ వైఖరిని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపుల సమస్యలపై మాట్లాడితే “వైసీపీ కోవర్ట్”(YSRCP Covert) అనే ముద్ర వేస్తూ సోషల్ మీడియా ద్వారా దూషణలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం వచ్చిన తర్వాత జనసేనలో(Jana Sena) కష్టపడ్డ నాయకులను పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ వైఖరి కాపు సమాజాన్ని నిరాశకు గురిచేసిందని అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ నేత అంబటి రాంబాబుతో (Ambati Rambabu) వేదిక పంచుకోవడంపై టీడీపీ వివరణ కోరడం కూడా కాపు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక సామాజిక వర్గ నాయకుడికి నివాళులర్పించడానికి వెళ్లినా వివరణ అడగడం సరైందేనా అంటూ కాపు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కస్టోడియల్ డెత్‌లో మరణించిన గాదే సాయికృష్ణ (Gade Sai Krishna) తల్లి విజయలక్ష్మి కూడా తమ కుటుంబం పవన్ కళ్యాణ్ అభిమానులేనని, అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని పదేపదే “క్రిమినల్”గా సంబోధించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొన్నారు.

ఇదే సమయంలో రేపల్లెకు చెందిన ప్రముఖ కాపు నేత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు గూడపాటి శ్రీనివాసరావు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మగౌరవం దెబ్బతింటోందని, నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, కాపు సమాజానికి బలమైన నాయకత్వం వైఎస్సార్సీపీలోనే ఉందన్నారు. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు వంటి నేతలు కాపు సమాజానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు.

కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు (Chanamalla Prasada Rao) కూడా పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాస్తూ కూటమి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. కాపులకు ఇచ్చిన హామీల అమలు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. “కాపులు మీ కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు.. మీ కుటుంబం కాపులను ఓన్ చేసుకుందా?” అంటూ ఆయన లేఖలో ప్రశ్నించారు.

టీడీపీలో కాపు నేతలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఆత్మగౌరవం దెబ్బతింటోందని గూడపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారం కారణంగా చాలామంది మౌనం పాటిస్తున్నా, రాబోయే రోజుల్లో మరిన్ని కాపు నాయకులు వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు కూటమి రాజకీయాలకు కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment