---Advertisement---

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాలను ప్రశ్నించిన ధర్మాసనం..!

August 7, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఉచిత పథకాలు(Free Schemes), ప్రభుత్వాల పాలనా (Governance) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సమాజంలో పెరుగుతున్న ప్రమాదకర పరిస్థితులపై హెచ్చరించేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు జస్టిస్ నగేష్ బీమాపాక (Justice Nagesh Bheemapaka) స్పష్టం చేశారు. ఉచిత పథకాల ప్రయోజనాలను కోటీశ్వరులు సైతం పొందుతున్నారని, రైతుబంధు (Rythu Bandhu) వంటి పథకాలతో ధనికులు కూడా లబ్ధి పొందుతుండటంతో ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోందన్నారు.

ఒకప్పుడు దేశానికి మనం ఏమి చేస్తున్నామనే ఆలోచన ప్రజల్లో ఉండేదని, గాంధీ(Gandhi), నెహ్రూ(Nehru), ప్రకాశం పంతులు వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని దేశానికి ఏదో చేయాలనే తపన ఉండేదని న్యాయమూర్తి గుర్తుచేశారు. ప్రస్తుతం దేశం మనకేమిచ్చింది, ప్రభుత్వం నాకేమిచ్చింది అనే ధోరణి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.

ఉచిత పథకాల(Free Schemes) కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని, రైతుల(Farmers) పరిస్థితి దారుణంగా మారుతోందని పేర్కొన్నారు. ఉచితంగా ప్రయోజనాలు లభిస్తున్నప్పుడు తాము ఎందుకు పనిచేయాలనే భావన పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ తరాలు మనుషులు స్వయంగా కష్టపడి పనిచేసేవారని చెప్పుకునే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలు ఉచిత పథకాలను ఇలాగే కొనసాగిస్తే ఆర్థిక వనరులు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తూ దేశాన్ని లేదా రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజుల విషయంలో అర్హత, ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆర్థిక సాయం అందించాలని సూచించారు.

ప్రభుత్వాల నిర్ణయాలు, తప్పిదాల కారణంగా ఉన్నతాధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి అన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినందుకే సందీప్ సుల్తానియాపై (Sandeep Sultania) 3,000 నుంచి 4,000 వరకు కేసులు, 100కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన జీవితకాలం కోర్టు కేసులతోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

తన వ్యాఖ్యలు ఏ ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం కోసం కాదని జస్టిస్ నగేష్ బీమాపాక (Nagesh Bheemapaka) స్పష్టం చేశారు. ఒక పౌరుడిగా సమాజంపై ఉన్న ఆవేదనతో, భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రమాదాలపై హెచ్చరించేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ప్రస్తుత పరిస్థితులపై ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment