తమిళనాడు ముఖ్యమంత్రి(Tamil Nadu CM), టీవీకే(TVK) అధినేత దళపతి జోసెఫ్ విజయ్ (Thalapathy Joseph Vijay) వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత (Sangeetha) గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను (Petition) తాజాగా వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో (Chengalpattu Family Welfare Court) ఆమె విజ్ఞప్తి చేయగా, న్యాయస్థానం కేసును ముగించింది.
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చ జరుగుతోంది. విజయ్, సంగీత 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.
దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితంలో వ్యక్తిగత కారణాలు, మనస్పర్థల కారణంగా దంపతుల మధ్య విభేదాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. దీంతో సంగీత ప్రత్యేక వివాహ చట్టం కింద విడాకులు (Divorce) కోరుతూ చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో పలుమార్లు విచారణ జరిగింది. అయితే ఈ క్రమంలో విజయ్, సంగీత మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో విడాకుల కేసును కొనసాగించడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూ సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
సంగీత పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో న్యాయస్థానం విడాకుల కేసును అధికారికంగా ముగించింది. దీంతో విజయ్, సంగీత దాంపత్య జీవితానికి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు, మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







