పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం పేరును ‘పశ్చిమ బంగా’గా (Paschim Banga) మార్చేందుకు ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో బిల్లు (Assembly Bill) ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య(Samik Bhattacharya) తెలిపారు. రాష్ట్ర చరిత్ర, గుర్తింపుతో ముడిపడిన పేరుగా ‘పశ్చిమ బంగా’ను ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు.
మీడియాతో మాట్లాడిన సమిక్ భట్టాచార్య.. ‘వెస్ట్ బెంగాల్’ (West Bengal), ‘బంగ్లా’(Bangla) వంటి పేర్లకు బదులుగా ‘పశ్చిమ బంగా’ను (Paschim Banga) ఉపయోగించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రతో పేరుకు ఉన్న అనుబంధాన్ని కొనసాగించడమే ప్రతిపాదన ఉద్దేశమని చెప్పారు. అయితే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడం మాత్రమే పేరు మార్పుకు సరిపోదు. రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ ఆమోదంతో పాటు తదుపరి ప్రక్రియ పూర్తవాల్సి ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ పేరు మార్పు అంశం కొత్తది కాదు. 1999, 2011లో ‘పశ్చిమ బంగా’ పేరును ప్రతిపాదించగా, 2016లో ‘బంగ్లా’(Bangla), ‘బెంగాల్’(Bengal), ‘బంగాల్’(Bangal) పేర్లు తెరపైకి వచ్చాయి. 2018లో ‘బంగ్లా’ పేరుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ అది అధికారికంగా అమల్లోకి రాలేదు. ఇప్పుడు మరోసారి ‘పశ్చిమ బంగా’ ప్రతిపాదనతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై చేసిన ప్రసంగాన్ని సమిక్ భట్టాచార్య ప్రశంసించారు. మోదీ తన రాజకీయ జీవితం దేశానికి అంకితమని చెప్పడంతో పాటు స్వామి వివేకానంద, రిషి అరబిందో వంటి ప్రముఖులను ప్రస్తావించారని తెలిపారు.
మోదీ ప్రజాదరణను చూసి రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రతిపక్షాలు భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు సమిక్ స్పందిస్తూ తమకు ఎవరి మీదా భయం లేదన్నారు. ప్రతిపక్షాల వద్ద ప్రస్తావించడానికి సరైన రాజకీయ అంశాలు లేవని విమర్శించారు. యువత మోదీతో అనుసంధానమవుతున్నారన్నది తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు.







