డీఎస్సీ–2025 నియామకాలపై (DSC–2025 Recruitments) రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల (Protests) సందర్భంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న నిరుద్యోగ యువతపై (Unemployed Youth) అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన జగన్.. “ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) Gen Z గొంతును మూయలేరు.. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు” అని పేర్కొన్నారు.
డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్(Question Paper Leak), నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో(CBI) విచారణ జరిపించాలని నిరుద్యోగ యువత శాంతియుతంగా డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం హింసతో సమాధానం ఇస్తోందని జగన్ ఆరోపించారు. నిరసనకారులపై దాడులు చేయడం ద్వారా వారి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు.
విజయవాడలో (Vijayawada) రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న శిబిరంపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి టెంట్లను ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో (Malladi Vishnu) పాటు నిరుద్యోగ యువతపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని తెలిపారు. మహిళలపై కూడా దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనలు పోలీసుల సమక్షంలోనే జరిగాయని ఆయన విమర్శించారు.
@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026
చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో నిరసన శిబిరాలపై దాడులు జరిగాయని జగన్ పేర్కొన్నారు. పలువురు నాయకులను పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతున్నట్లయితే.. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని జగన్ ప్రశ్నించారు. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రూ.9,000 కోట్లకు చేరిన ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement), వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలను వెంటనే విడుదల చేయాలని జగన్ కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో (Election Manifesto) ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని గత 2 ఏళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చని, నిరసనకారులను అరెస్టు చేయవచ్చని.. కానీ డీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చెరిపేయలేరని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతలో ఉన్న ఆగ్రహాన్ని అణచివేయడం సాధ్యం కాదని, న్యాయం జరిగే వరకు వారి పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.







