ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సహకార డెయిరీల భవిష్యత్తుపై (Co-operative Dairies Future) రాజకీయ వివాదం ముదురుతోంది. గతంలో చిత్తూరు డెయిరీ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేస్తూ, ప్రస్తుతం విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)(Krishna Milk Union) వ్యవహారంలోనూ అదే తరహా రాజకీయ జోక్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్ డెయిరీ (Heritage Dairy) ప్రయోజనాల కోసమే సహకార రంగంలోని డెయిరీలను బలహీనపరుస్తున్నారనే విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి.
1945లో చిన్న చిల్లింగ్ ప్లాంట్‌గా(Small Chilling Plant) ప్రారంభమైన చిత్తూరు డెయిరీ(Chittoor Dairy) 1988 నాటికి దేశంలోని ప్రముఖ పాల సహకార సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. అయితే 1992లో హెరిటేజ్ డెయిరీ(Heritage Dairy) విస్తరణతో చిత్తూరు డెయిరీకి కష్టాలు మొదలయ్యాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. పాల సేకరణ(Milk Procurement) తగ్గించడం, రైతులకు బకాయిలు పేరుకుపోవడం వంటి పరిణామాలతో సంస్థను నష్టాల్లోకి నెట్టారని, చివరకు 2002 ఆగస్టు 31న డెయిరీని మూసివేశారని వారు పేర్కొంటున్నారు. ఈ అంశంపై అప్పట్లో అసెంబ్లీలోనూ తీవ్ర రాజకీయ చర్చ జరిగింది.
చిత్తూరు డెయిరీని వైఎస్ జగన్ ప్రభుత్వం(YS Jagan Government) పునరుద్ధరించే చర్యలు చేపట్టిందని, అప్పులు తీర్చి అమూల్ భాగస్వామ్యంతో పెట్టుబడులు పెట్టి 2023లో పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందని వైఎస్సార్సీపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
ఇక ప్రస్తుతం విజయ డెయిరీ(Vijaya Dairy) (కృష్ణా మిల్క్ యూనియన్) (Krishna Milk Union) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సుమారు 1.50 లక్షల కుటుంబాల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఈ సంస్థ రోజుకు 4.60 లక్షల లీటర్ల పాల విక్రయాలతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను అందిస్తోంది. బాపులపాడు మండలం వీరవల్లిలో రెండో యూనిట్‌ను ప్రారంభించి పాల సేకరణ, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది.
విజయ డెయిరీ విస్తరణతో హెరిటేజ్‌కు(Heritage) పోటీ పెరుగుతుందనే కారణంతోనే సంస్థపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలోని డెయిరీకి చెందిన విలువైన 24 ఎకరాల భూములపైనా ప్రభుత్వ పెద్దల దృష్టి పడిందనే విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు(Chalasani Anjaneyulu) రాజీనామా వ్యవహారం మరింత వివాదానికి దారితీసింది. మంత్రుల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురయ్యాయని విమర్శలు వెల్లువెత్తగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే రాజీనామా చేయించారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.
ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పాడి రైతులతో ముడిపడి ఉన్న విజయ డెయిరీపై జరుగుతున్న పరిణామాలు సహకార రంగ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చిత్తూరు డెయిరీ గతాన్ని తలపిస్తున్నాయా? లేక విజయ డెయిరీ విషయంలో వాస్తవ పరిస్థితి మరోలా ఉందా? హెరిటేజ్ ప్రయోజనాల కోసం సహకార డెయిరీలను బలహీనపరుస్తున్నారనే ఆరోపణపై తెలుగుదేశం అధినేత నుండి ఎందుకు సమాధానం రావడంలేదు అనేది కీలక ప్రశ్నలుగా మారాయి.







