---Advertisement---

కూటమిలో కలహాల కాపురం.. చిరంజీవి, ఎన్టీఆర్‌లపై పరస్పర దూషణలు!

August 12, 2026

Summarize with AI

---Advertisement---

అధికారం, పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకున్న టీడీపీ(TDP), జనసేన (Janasena) పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో మాత్రం విభేదాలు కొనసాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జగన్ అనే రాజకీయ శక్తిని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు ఒక్కటైనట్లు కనిపించినా.. పదవులు, కాంట్రాక్టులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల విషయంలో ఇరు పార్టీల దిగువస్థాయి నాయకులు, కార్యకర్తల మధ్య పోరు కొనసాగుతూనే ఉందనే విమర్శలు ఉన్నాయి.

తాజాగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) తనయుడికి సంబంధించిన సినిమా వ్యవహారంలో సీనియర్ ఎన్టీఆర్‌ను ట్రోల్ చేశారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో మొదలైన వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని(Chiranjeevi)లక్ష్యంగా చేసుకోగా, మరోవైపు జనసేనకు చెందిన కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును(Nandamuri Taraka Rama Rao) లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

పార్టీ వ్యవస్థాపకుడిపైనే ఈ స్థాయిలో దూషణలు జరుగుతున్నా టీడీపీ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదంటూ పలువురు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన–టీడీపీ(Janasena–TDP) సోషల్ మీడియా కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దూషణలకు దిగవద్దని సూచిస్తూ ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం. టీడీపీ, జనసేన మధ్య సఖ్యత, సమన్వయం కొనసాగించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

అయితే రాజకీయ అవసరాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడుతున్న టీడీపీ, జనసేన.. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖులపై వ్యక్తిగత దూషణలకు దిగిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వాలపై లేదా? చర్యలు తీసుకున్న తర్వాతే ఇలాంటి దూషణలను తాము ప్రోత్సహించబోమని స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదా? రాజకీయ ప్రయోజనాల కోసం చివరకు రెండు పార్టీలకు చెందిన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులపై పరస్పరం దూషణలు చేసుకోవడం సమంజసమేనా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment