---Advertisement---

సర్కారు బడిలో కూలిన గోడ.. బలైన విద్యార్థి! నాడు–నేడు నిలిచిపోవడమే కారణమా?

August 17, 2026

Summarize with AI

---Advertisement---

మన్యం జిల్లా (Manyam District) సాలూరులోని(Salur) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Government High School) ప్రహరీ గోడ కూలి (Compound Wall) పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ (Arun Teja) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్వహణ(Infrastructure Maintenance), భద్రతా ప్రమాణాలు(Safety Standards), అధికారుల పర్యవేక్షణపై అనేక అనుమానాలను పెంచుతోంది.

2019–20 విద్యా సంవత్సరంలో అప్పటి జగన్ పరిపాలనలో(Jagan Government) ప్రారంభమైన ‘మనబడి నాడు–నేడు’(Mana Badi Nadu-Nedu)కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించే చర్యలు చేపట్టారు. మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, కిచెన్‌ షెడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇచ్చారు.

మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలను(Schools) అభివృద్ధి చేయగా, రెండో దశలో సుమారు రూ.8 వేల కోట్లతో మరో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు. మిగిలిన పాఠశాలలను మూడో దశలో అభివృద్ధి చేయాల్సి ఉండగా, ప్రభుత్వం మారిన నేపథ్యంలో నాడు–నేడు కార్యక్రమం(Nadu-Nedu Program) కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది.

అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల భద్రత, నిర్వహణే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పాతబడిన భవనాలు, ప్రహరీ గోడలు, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రమాదాలను ముందుగానే గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ సంచరించే పాఠశాల ప్రాంగణంలో ప్రమాదకరంగా మారిన నిర్మాణాలపై ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నగా మారింది.

ఒక ప్రభుత్వం ప్రారంభించిన పథకానికి రాజకీయ ప్రాధాన్యతలు ఆపాదించి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల భద్రత విషయంలో రాజీ పడటం ఏ ప్రభుత్వానికైనా తగదు. ప్రభుత్వాలు మారినా పిల్లల ప్రాణాలకు సంబంధించిన బాధ్యత మారకూడదు. ఒక విద్యార్థి ప్రాణం కోల్పోయిన తర్వాతే పాఠశాలల భద్రతపై మంత్రి లోకేశ్(Lokesh) స్పందించడం అత్యంత బాధాకరమని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.

సాలూరు ఘటనను ఒక సాధారణ ప్రమాదంగా పరిగణించకుండా ప్రభుత్వం ఒక హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రహరీ గోడలు, పాత భవనాలు, శిథిల నిర్మాణాలపై తక్షణమే సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, అవసరమైన చోట ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. అలాగే, మూడో దశ నాడు–నేడు పనులను వెంటనే ప్రారంభించి, మిగిలిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని పలువురు కోరుతున్నారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)నేతృత్వంలోని ప్రభుత్వం అరుణ్ తేజ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు హామీ ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను పటిష్టంగా నిర్వహించడం ఇప్పుడు ప్రభుత్వ తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని వారు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment