తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’(Jana Nayagan). హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా, మమితా బైజు(Mamitha Baiju), ప్రియమణి (Priyamani) కీలక పాత్రల్లో కనిపించారు. దళపతి విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. ఆ తర్వాత కొంతకాలం సెన్సార్ వివాదాల్లోనూ చిక్కుకుంది. ఎట్టకేలకు ‘జన నాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీ(OTT) వేదికపైకి రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజాగా ‘జన నాయగన్’ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. ఆగస్ట్ 21 (August 21) నుంచి జీ5లో తమిళ భాషలో ‘జన నాయగన్’ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా జీ5 సంస్థ దళపతి విజయ్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీనికి ‘వన్ లాస్ట్ డ్యాన్స్’(One Last Dance) అనే భావోద్వేగపూరితమైన శీర్షికను జత చేసింది. విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి సినిమా కావడంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








