---Advertisement---

తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. కీలక వివరాలు ఇవే..!

August 17, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో (Telangana) ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో(Special Intensive Revision – SIR) భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) విడుదల చేశారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వే (House-to-House Survey) ఆధారంగా ఈ ముసాయిదా జాబితాను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

ముసాయిదా జాబితా విడుదలకు ముందు రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,64,87,213 మంది నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను (Enumeration Forms) సేకరించారు. అంటే మొత్తం ఓటర్లలో 78.30 శాతం మంది వివరాలను అధికారులు సేకరించారు.

సర్వేలో భాగంగా 9,22,229 మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించారు. మరో 57,46,803 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో వారి వివరాలు అందుబాటులో లేవని అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా 6.70 లక్షల మంది ఓటర్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.

సరైన వివరాలు అందుబాటులో లేకపోవడంతో 32.2 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ (Voter Mapping Process) పూర్తికాలేదు. ఓటర్ల వివరాల సేకరణలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించినట్లు అధికారులు తెలిపారు.

ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్రంలో 368 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 36,353కు చేరింది.

సర్వే సమయంలో సరైన వివరాలు నమోదు కాని వారు, 2002 నాటి వివరాలతో అనుసంధానం కాని ఓటర్లకు ఎన్నికల నమోదు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. సంబంధిత ఓటర్లు తమ వివరాలను సమర్పించి, అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఓటు హక్కు కోల్పోయిన వారు కూడా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఓటరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, ఇతర ఎన్నికల సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం అధికారిక డిజిటల్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్లు తమ పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment