ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల (Junior Doctors) ఆందోళన (Protest) మరింత ఉధృతమైంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో (Kurnool Government Hospital) పాటు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఓపీ సహా పలు వైద్య సేవలను బహిష్కరించారు.
జూలై నుంచి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ, గత 8 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతోనే విధుల బహిష్కరణకు దిగినట్లు జూనియర్ డాక్టర్ల నాయకులు తెలిపారు. జూడాల (Junior Doctors) ఆందోళనతో మాతా శిశు సంరక్షణతో పాటు పలు వైద్య సేవలపై ప్రభావం పడుతోంది.
రోగులకు ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీనియర్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ సర్జన్ల సేవలను వినియోగిస్తూ వైద్య సేవలను కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
ఏపీ జూడాల ప్రధాన డిమాండ్లు
రాష్ట్రంలో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని జనవరి నుంచి అమలు కావాల్సిన స్టైఫండ్‌ను (Stipend) 30 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
సీనియర్ వైద్యుల (Senior Doctors) పదవీ విరమణ వయస్సును (Retirement Age) 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే నాన్-మెడికల్ డిగ్రీలు చేసిన వారిని కాకుండా, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారమే అసిస్టెంట్ ప్రొఫెసర్లను (Assistant Professors) నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల పీజీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా ఉంటాయని జూడాలు పేర్కొంటున్నారు.
చర్చలకు సిద్ధం.. ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా, జూనియర్ డాక్టర్ల నిరసన కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ జంగాల అజయ్ కుమార్, సీపీఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి అరిగెల సాయి తదితర నాయకులు హాజరై మద్దతు తెలిపారు.






