పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) కీలకంగా జోక్యం చేసుకుంది.
అడియాలా జైలులో (Adiala Jail) ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను వెంటనే ఇస్లామాబాద్‌లోని(Islamabad) షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి (Shifa International Hospital) తరలించి చికిత్స అందించాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కోరిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఇమ్రాన్‌ఖాన్‌కు నిపుణులైన వైద్యులతో పాటు కుటుంబం ఎంపిక చేసిన వైద్యుల ద్వారా చికిత్స అందించేందుకు కోర్టు అనుమతించింది.
కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్‌ఖాన్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆస్పత్రికి తరలించనున్నారు. ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా(Dr. Uzma), వ్యక్తిగత వైద్యుడు కూడా చికిత్స సమయంలో అక్కడ ఉండేందుకు అనుమతి లభించింది. వైద్య రికార్డులను సమర్పించాలని, ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. చికిత్స ఖర్చును ఇమ్రాన్‌ఖాన్ కుటుంబమే భరించాలని స్పష్టం చేసింది.
2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్‌ఖాన్ జైలులోనే ఉన్నారు. ఇటీవల ఆయన కుడి కంటి సమస్య (Right Eye Problem) చికిత్స తర్వాత మెరుగుపడిందని జైలు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నివేదికను ఆయన పార్టీ తిరస్కరించింది. తమకు నమ్మకమైన వైద్యుల ద్వారా షిఫా ఆస్పత్రిలో చికిత్స అందించాలని డిమాండ్ చేసింది.
ఆగస్టు 1న నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలో ఇమ్రాన్‌ఖాన్ రక్తపోటులో హెచ్చుతగ్గులు, తలనొప్పి, ఆందోళన, గుండె దడ, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. పరీక్ష సమయంలో ఆయన రక్తపోటు 140/100గా నమోదైంది. గుండె పరిస్థితిని అంచనా వేసేందుకు సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష చేయాలని వైద్యులు సూచించారు.
మానసిక ఒత్తిడి తగ్గించేందుకు భార్యతో ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని, పుస్తకాలు అందించాలని వైద్యులు సూచించారు. అధిక రక్తపోటు నియంత్రణకు మందుల మోతాదును కూడా పెంచారు.
ఇమ్రాన్‌ఖాన్‌కు జైలులోనే సరైన వైద్యం అందుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులు, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ మాత్రం స్వతంత్ర వైద్య నిపుణులతో చికిత్స చేయించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆస్పత్రిలో చికిత్సకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.








