అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో మరో కీలక మార్పు జరగనుంది. వైట్‌హౌస్ (White House) ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ఆగస్టు నెలాఖరులో తన పదవికి రాజీనామా(Resignation) చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కుటుంబానికి మరింత సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
28 ఏళ్ల వయసులోనే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా (White House Press Secretary) బాధ్యతలు చేపట్టిన కరోలిన్ లీవిట్ (Karoline Leavitt).. గత ఏడాదిన్నరగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇంత కీలకమైన బాధ్యతను నిర్వర్తించడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా ఆమె అభివర్ణించారు. ఇటీవలే మాతృత్వ సెలవు ముగించుకుని విధుల్లోకి వచ్చిన లీవిట్.. మే నెలలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చారు.
ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్ బృందానికి ఆమె దూరం కానున్నారు. ట్రంప్‌కు ముఖ్యమైన బాహ్య సలహాదారుల్లో ఒకరిగా లీవిట్ కొనసాగుతారని అధ్యక్షుడు స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీలోనూ ఆమె తన ప్రభావాన్ని కొనసాగిస్తారని తెలిపారు.
నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో లీవిట్ అనుభవం, రాజకీయ వ్యూహాలు ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రెస్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ట్రంప్ రాజకీయ బృందంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
2024లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో కరోలిన్ లీవిట్ చేరారు. ఎన్నికల అనంతరం అధికార బదిలీ బృందంలో ప్రతినిధిగా పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ ఆమెను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా (White House Communications Director) నియమించారు.
తన పదవీకాలంలో లీవిట్.. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్తో కలిసి మీడియా వ్యవహారాల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. పాడ్‌కాస్ట్‌లు, వార్తా పత్రికలు, డిజిటల్ మీడియా సంస్థలకు ప్రాధాన్యం పెంచడంతో పాటు మీడియాకు అందుబాటును విస్తరించారు.
సంప్రదాయ ప్రెస్ పూల్ విధానంలోనూ(Traditional Press Pool System) పలు మార్పులు చేపట్టారు. ఈ నిర్ణయాలకు కొందరి నుంచి ప్రశంసలు లభించగా.. పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేసే సంస్థల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. ట్రంప్ బృందంలో కీలక సలహాదారుగా లీవిట్ తన పాత్రను కొనసాగించనున్నారు.








