ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు)కు (Konidela Nagendra Babu) కేబినెట్ హోదాతో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా (AP Green Executive Committee Chairman) ప్రభుత్వం నియమించడం ఇప్పుడు రాజకీయంగానే కాకుండా, రాజ్యాంగపరమైన చర్చకు దారితీసింది. పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జారీ చేసిన జీవో నంబర్ 93 ద్వారా జరిగిన ఈ నియామకం వివాదంగా మారే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. చైర్మన్ పదవితో పాటు కేబినెట్ హోదా, వేతనం, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, మంత్రితో సమానమైన ప్రోటోకాల్ కల్పించడంపై ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’(Office of Profit) వివాదం తెరపైకి వచ్చింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఎ) ప్రకారం, రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడు ప్రభుత్వం కింద ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’(Office of Profit) పదవిని చేపడితే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఆ పదవిని ప్రత్యేక చట్టం ద్వారా అనర్హత నుంచి మినహాయించినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. ఇక్కడ నాగబాబుకు కట్టబెట్టిన పదవిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా మినహాయించిందా లేదా అనేది తేలాల్సి ఉంది.
ఒక పదవి ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’(Office of Profit) కిందకు వస్తుందా లేదా అనే విషయంలో న్యాయస్థానాలు పలు ప్రమాణాలను నిర్దేశించాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నియామక అధికారం ప్రభుత్వం వద్ద ఉందా? తొలగించే అధికారం ఎవరిది? వేతనం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా? ఆ ప్రయోజనాలు ప్రభుత్వ ఖజానా నుంచి అందుతున్నాయా? వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో నాగబాబు నియామకానికి సంబంధించిన జీవో, ఆయనకు కల్పించిన అధికారాలు, వేతనం, ఇతర సౌకర్యాలు కీలకంగా మారనున్నాయి.
గతంలో జయ బచ్చన్ కేసు(Jaya Bachchan Case), సోనియా గాంధీ (Sonia Gandhi) నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వివాదం(National Advisory Council), పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలపై వచ్చిన వివిధ న్యాయపరమైన వివాదాలు ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’(Office of Profit) అంశం ఎంత సున్నితమైనదో స్పష్టం చేశాయి. కేవలం వేతనం తీసుకున్నారా లేదా అన్న అంశమే కాకుండా, ఆ పదవి ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉందా అనే కోణాన్ని కూడా న్యాయస్థానాలు పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి.
నాగబాబుకు చైర్మన్ పదవిలో ప్రాథమిక వేతనం, సిబ్బంది, వాహనం, కార్యాలయ సౌకర్యాలు, ప్రయాణ భత్యాలు వంటి ప్రయోజనాలు కల్పించినట్లు చర్చ జరుగుతోంది. ఇవి కేవలం పదవి నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం ఇచ్చే పరిహార భత్యాలా? లేక వ్యక్తిగత ఆర్థిక లాభం కల్పించే వేతన ప్రయోజనాలా? అన్నది ఈ వివాదంలో ప్రధాన ప్రశ్నగా మారనుంది.
ఇప్పటికే నాగబాబు ఎమ్మెల్సీగా జీతం తీసుకుంటుండగా, ఇప్పుడు కల్పించిన కేబినెట్ హోదా కింద ఆయనకు జీతం, అలవెన్సులు కలిపి నెలకు దాదాపు రూ.4.50 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుందని చర్చ జరుగుతోంది. దీంతో రెండు విధాలుగా వేతనాలు పొందడం తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదానికి స్పష్టత రావాలంటే ‘ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్’(AP Green Executive Committee Chairman) పదవిని రాష్ట్రంలోని అనర్హత తొలగింపు చట్టం కింద ఇప్పటికే మినహాయించారా లేదా అనే అంశం కూడా కీలకం. ఒకవేళ చట్టబద్ధమైన మినహాయింపు లేకపోతే, ఈ నియామకం రాజ్యాంగపరమైన సవాలును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
మొత్తంగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన అన్న నాగబాబుకు బహుకరించిన ఈ నియామకం రాజకీయంగానే కాకుండా రాజ్యాంగపరంగానూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కేబినెట్ హోదా, వేతనం, అధికారాలు, చట్టబద్ధమైన మినహాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే, ఆయన ఎమ్మెల్సీ పదవి ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ వివాదంలో చిక్కుకునే అవకాశంపై మరింత చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది.







