---Advertisement---

1 గ్రాము బంగారు ఉంగరాల పథకం.. ఒక్క పైసాకే సేవలు! తమిళనాడు ప్రభుత్వ టెండర్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇదే!

August 22, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని(Gold Ring) ఉచితంగా అందించేందుకు ‘తై మామన్ తంగ మోదిరమ్’(Thai Maman Thanga Modhiram) పథకాన్ని తీసుకురానుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పథకం కింద మొత్తం 4,41,667 బంగారు ఉంగరాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.755.83 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించింది. ఇందులో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే బంగారం అసలు ధరను మినహాయించి తయారీ, వేస్టేజ్, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా వంటి అన్ని సేవలకు జోయ్ అలుక్కాస్(Joyalukkas) సంస్థ కేవలం రూ.0.01 అంటే ఒక్క పైసా మాత్రమే ధరను కోట్ చేయడం సంచలనంగా మారింది.

టెండర్ నిబంధనల ప్రకారం బంగారం ధరను ప్రభుత్వం విడిగా చెల్లించనుంది. ఇందుకోసం ఇండియన్ బుల్లియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ నిర్ణయించే మార్కెట్ ధరను ప్రాతిపదికగా తీసుకుంటారు. దీంతో టెండర్‌లో అసలు పోటీ బంగారం ధరపై కాకుండా తయారీ, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా తదితర సేవల ఛార్జీలపైనే జరిగింది.

ఒక్క పైసా ధరను కోట్ చేసిన జోయ్ అలుక్కాస్ సంస్థ ఎల్1గా నిలిచింది. అనంతరం టెండర్ నిబంధనల ప్రకారం అదే ధరకు సరఫరా చేసేందుకు ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చారు. అయితే కల్యాణ్ జువెల్లర్స్(Kalyan Jewellers) మాత్రమే ఒక్క పైసా ధరకు అంగీకరించింది.

దీంతో ప్రభుత్వం టెండర్ ఆర్డర్‌ను రెండు సంస్థలకు కేటాయించింది. జోయ్ అలుక్కాస్‌కు 70 శాతం, కల్యాణ్ జువెల్లర్స్‌కు(Kalyan Jewellers) 30 శాతం ఆర్డర్‌ను అప్పగించింది. దీంతో రూ.755 కోట్లకు పైగా అంచనా వ్యయం ఉన్న పథకంలో సేవల కోసం ఒక్క పైసా మాత్రమే ధర నిర్ణయించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా తయారీ, రవాణా, బీమా, హాల్‌మార్కింగ్ వంటి ప్రక్రియలకు గణనీయమైన ఖర్చులు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ సంస్థలు ఒక్క పైసాకే(One Paisa) సేవలు అందించేందుకు ఎందుకు ముందుకొచ్చాయనే అంశంపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు టెండర్ పొందిన సంస్థల ప్రతినిధులు మాత్రం ఇది ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకమని తెలిపారు. ఎలాంటి వ్యాపార లాభాలను ఆశించకుండా సామాజిక బాధ్యతగా ఈ సేవలను అందించేందుకు ముందుకొచ్చామని స్పష్టం చేశారు.

టెండర్ ప్రక్రియపై ప్రభుత్వం కూడా స్పందించింది. నిబంధనలకు అనుగుణంగానే ప్రక్రియను నిర్వహించామని, అత్యంత పారదర్శకంగా ఎల్1 సంస్థను (L1 Company) ఎంపిక చేశామని పేర్కొంది. బంగారం అసలు ఖర్చును ప్రభుత్వం భరిస్తుండటంతో సేవల ఛార్జీల విషయంలో సంస్థలు పోటీ పడ్డాయని వివరించింది.

అయితే ఒక్క పైసా కోట్ వెనుక ఉన్న అసలు కారణమేంటనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ‘తై మామన్ తంగ మోదిరమ్’ పథకం కంటే దాని టెండర్ వ్యవహారమే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా చర్చకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment