పల్నాడు జిల్లా(Palnadu District) చిలకలూరిపేట (Chilakaluripet) సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Fatal Road Accident) ఏడుగురు దళిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ప్రభుత్వం (Government) నుంచి తక్షణ భరోసా లేదా స్పష్టమైన పరిహారం ప్రకటించకపోవడంపై బాధిత కుటుంబాలు, దళిత సంఘాల్లో (Dalit Organizations) తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నరసరావుపేట టీడీపీ ఎంపీ(TDP MP) లావు శ్రీకృష్ణదేవరాయలును (Lavu Srikrishna Devarayalu) బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బాధితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వాలని ఎంపీ సూచించడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి విషాదంలో ప్రభుత్వం స్వయంగా స్పందించి అండగా నిలవాల్సిన సమయంలో వినతిపత్రం ఇవ్వాలని చెప్పడంపై మండిపడ్డారు.
ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున, గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరాయి.
డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని బాధితులు తేల్చిచెప్పారు. చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి (Chilakaluripet Area Hospital) వద్ద ప్రారంభమైన నిరసన అనంతరం ఆందోళనకారులు ర్యాలీగా జాతీయ రహదారి–16పై బైఠాయించారు. దీంతో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాము ఓట్లు వేసి గెలిపించిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao) స్వయంగా వచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యలపై స్పందించే వరకు నిరసన కొనసాగుతుందని వారు ప్రకటించారు.
గురువారం సాయంత్రం ప్రారంభమైన ఆందోళన శుక్రవారం ఉదయం వరకు కొనసాగడంతో చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో (NRT Centre, Chilakaluripet) ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, వేలూరు గ్రామస్తులు పెద్దఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళన నేపథ్యంలో రాత్రి సమయంలో డీఎస్పీ, ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అయితే, అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.






