అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) మరోసారి నోబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Prize) దక్కలేదు. 2026 సంవత్సరానికి గాను భారత మూలాలున్న దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం “నవీ” పిళ్లైకు (Navanethem “Navi” Pillay) ఈ అవార్డు లభించినట్లు ప్రకటించారు. శాంతి పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల రక్షణకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
తనకు నోబెల్ శాంతి పురస్కారం వస్తుందని ట్రంప్ ఆశించినప్పటికీ ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. 2025లో వెనిజులా (Venezuelan) ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో (María Corina Machado ఈ అవార్డును అందుకున్నారు.
నవీ పిళ్లై దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తూ మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. 1967లో న్యాయ సంస్థను స్థాపించిన ఆమె, 1988లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత న్యాయశాస్త్ర డిగ్రీ పొందారు. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
1999లో అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ ఫర్ రువాండాలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, అనంతరం అధ్యక్షురాలిగా పనిచేశారు. మారణహోమం, లైంగిక హింస, అత్యాచారం, ద్వేష ప్రచారానికి సంబంధించిన కేసుల విచారణలో కీలక పాత్ర పోషించారు. 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా సేవలందించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేశారు.
2021 నుంచి 2025 వరకు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలకు సంబంధించిన ఐరాస స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు నవీ పిళ్లై అధ్యక్షత వహించారు. మయన్మార్‌పై (Myanmar) మారణహోమం ఆరోపణలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయస్థానం విచారణలో 2019లో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
నవీ పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం లభించడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. మానవ హక్కుల పరిరక్షణకు ఆమె దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ప్రశంసించింది.
నోబెల్ శాంతి పురస్కారంతో పాటు 1.2 కోట్ల స్వీడిష్ క్రోనాల నగదు బహుమతి అందజేస్తారు. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం, శాంతి పరిరక్షణకు నవీ పిళ్లై చేసిన సేవలకు ఈ పురస్కారం అంతర్జాతీయ గుర్తింపుగా నిలవనుంది.








