పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మేనకోడలు బృష్టి ముఖర్జీ (Brishti Mukherjee) (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీర్భుమ్ (Birbhum) జిల్లాలోని ఆమె నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
బీర్భుమ్ జిల్లా రాంపూర్హాట్ (Rampurhat) పరిధిలోని కుసుంబా గ్రామంలో ఉన్న వారి నివాసంలోని రెండో అంతస్తు గదిలో మంగళవారం మధ్యాహ్నం బృష్టి ముఖర్జీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Post-Mortem) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఘటనకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఆమె మృతికి గల పూర్తి కారణాలను నిర్ధారిస్తామని పేర్కొన్నారు.
కాగా, బృష్టి ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర మానసిక ఒత్తిడితో (Severe Mental Stress) బాధపడుతున్నారని, అందుకు సంబంధించి చికిత్స కూడా పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఆమెకు సంబంధించిన విడాకుల కేసు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.








