పంజాబ్ రాజకీయాల్లో(Punjab Politics) మరో వివాదం తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) మాజీ నేత రాఘవ్ చడ్డా (Raghav Chadha) పేరు పంజాబ్ ముసాయిదా ఓటర్ జాబితా (Draft Voter List) నుంచి తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో(BJP) కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తన పేరును ‘షిఫ్టెడ్’గా(Shifted) గుర్తించారని రాఘవ్ చడ్డా తెలిపారు. తన ఓటర్ గుర్తింపు కార్డు మొహాలీలోనే నమోదై ఉన్నప్పటికీ తన పేరును షిఫ్ట్ అయినట్లు ఎలా గుర్తించారంటూ ప్రశ్నించారు.
తన పేరు తొలగించడం సాధారణ అధికారిక పొరపాటు కాదని, రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల ప్రక్రియ ద్వారా తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఓటర్ జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు పలు స్థాయిల్లో అధికారులు పనిచేస్తున్నప్పటికీ తన పేరును ‘షిఫ్టెడ్’గా(Shifted) ఎలా గుర్తించారో చెప్పాలని రాఘవ్ చడ్డా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల విషయంలో ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత తనపై రాజకీయ కక్ష పెరిగిందని రాఘవ్ చడ్డా ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం రాఘవ్ చడ్డా పేరు ముసాయిదా జాబితాలో లేకపోవడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల ప్రక్రియ అనంతరం ఆయన పేరు తిరిగి ఓటర్ జాబితాలో చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.







