---Advertisement---

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. ప్రసూతి సెలవుల తర్వాత మహిళ హోదా తగ్గించకూడదు!

September 2, 2026

Summarize with AI

---Advertisement---

ప్రసూతి సెలవులు (Maternity Leave) తీసుకున్న మహిళా ఉద్యోగులు (Women Employees) తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారి హోదా(Position), బాధ్యతలు(Responsibilities), అధికారాలను తగ్గించడం లేదా మార్చడం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టం చేసింది. సెలవులకు ముందు ఉన్న హోదాతో పాటు సమానమైన జీతం, అధికారాలు, బాధ్యతలు కల్పించాలని తేల్చిచెప్పింది.

ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961 ప్రకారం మహిళా ఉద్యోగులకు (Women Employees) కల్పించే రక్షణ కేవలం జీతం, ఉద్యోగ హోదాకే పరిమితం కాదని కోర్టు పేర్కొంది. పదోన్నతులు, ఉద్యోగ బాధ్యతలు, కెరీర్‌లో ఎదిగే అవకాశాలు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది.

14 ఏళ్ల అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ రాఖీ బిష్ట్ (Rakhi Bisht) 2022లో నెలకు రూ.2.6 లక్షల జీతంతో మేనేజర్‌గా ఓ సంస్థలో చేరారు. 2023 మేలో తన గర్భధారణ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసిన తర్వాత ఆమెను మరో బృందానికి బదిలీ చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో ప్రసూతి సెలవులకు వెళ్లిన ఆమె 2024 జులైలో తిరిగి విధుల్లో చేరారు.

అయితే ఆమె గతంలో పనిచేసిన పోస్టు అందుబాటులో లేదని చెబుతూ యాజమాన్యం మరో విభాగంలో కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలు తన విద్యార్హతలు, వృత్తిపరమైన అనుభవానికి సరిపోవడం లేదని పేర్కొంటూ రాఖీ బిష్ట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన జస్టిస్ సచిన్ దత్తా (Justice Sachin Datta) ధర్మాసనం యాజమాన్యం వాదనలను తోసిపుచ్చింది. ప్రసూతి హక్కులు అంటే కేవలం సెలవులు మంజూరు చేయడం, జీతంలో కోత విధించకపోవడం మాత్రమే కాదని స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగిని మానసికంగా, వృత్తిపరంగా దెబ్బతీసేలా హోదా లేదా బాధ్యతలు తగ్గించడం కూడా వివక్ష కిందకే వస్తుందని పేర్కొంది.

గత పోస్టును తిరిగి ఇవ్వడం సాధ్యం కాకపోతే అదే స్థాయిలో బాధ్యతలు, అధికారాలు, పదోన్నతి అవకాశాలు కలిగిన సమానమైన పోస్టును కేటాయించాలని కోర్టు ఆదేశించింది. ప్రసూతి సెలవుల కారణంగా ఉద్యోగి హోదా లేదా బాధ్యతల్లో మార్పులు చేయడాన్ని ప్రాథమికంగా వివక్షగానే పరిగణించాలని వ్యాఖ్యానించింది.

అదేవిధంగా ప్రసూతి అనంతరం మహిళా ఉద్యోగుల హోదా పరిరక్షణ, కెరీర్‌లో ఎదుగుదల, పిల్లల సంరక్షణ సౌకర్యాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment