టాటా గ్రూప్ (Tata Group) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా(Executive Chairman) చంద్రశేఖరన్ (N. Chandrasekaran) మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ముంబైలో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఆయనను మరోసారి చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. అయితే తాజా బోర్డు నిర్ణయంతో ఆయన మరో ఐదేళ్ల పాటు టాటా గ్రూప్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెలలో చంద్రశేఖరన్ మరోసారి చైర్మన్ పదవిని కోరుకోవడం లేదనే వార్తలు వెలువడిన నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు టాటా సన్స్ లిస్టింగ్‌పై (Tata Sons Listing) మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చంద్రశేఖరన్ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ, టాటా సన్స్‌ను లిస్టింగ్ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
టాటా సన్స్ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్థిని సిఫారసు చేసేందుకు 5 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ఉండాలి. ఇందులో 3 మంది సభ్యులను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్(Sir Dorabji Tata Trust, సర్ రతన్ టాటా ట్రస్ట్(Sir Ratan Tata Trust) సంయుక్తంగా నియమిస్తాయి. మరో 2 మంది సభ్యులను టాటా సన్స్ బోర్డు నామినేట్ చేయాల్సి ఉంటుంది.
అయితే చంద్రశేఖరన్‌ను మరోసారి చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు నిర్ణయించడంతో, ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు గతంలో చర్చించిన ప్రక్రియకు ప్రస్తుతానికి అవసరం లేకుండా పోయింది. తాజా నిర్ణయంతో టాటా గ్రూప్ నాయకత్వంపై కొనసాగుతున్న అనిశ్చితికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.








