కాంగోలో (Congo) ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకుంది. కిక్విట్ (Kikwit) నుంచి రాజధాని కిన్షాసాకు (Kinshasa) తిరిగి వెళ్తున్న విమానం కెన్గే (Kenge) ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది.
మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే(Lieutenant General Mutombo Katalayi Tiende), సాయుధ దళాల ఆడిటర్ జనరల్ (Auditor General of the Armed Forces) లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా (Lieutenant General Bakumi Likulia) ఉన్నారు. వీరితో పాటు ప్రతినిధి బృందంలోని సభ్యులు, విమాన సిబ్బంది కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
సాంకేతిక లోపంతోనే ప్రమాదమా?
కిక్విట్ నుంచి కిన్షాసాకు తిరుగు ప్రయాణంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో విమానం అదుపుతప్పి కెన్గే ప్రాంతంలో కూలిపోయినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే (Major General Ekomi Ekeng) తెలిపారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తోంది.
కాంగోలో ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో భద్రతా పరిస్థితులు కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్నాయి. పలు సాయుధ, తిరుగుబాటు గ్రూపులతో కాంగో సైన్యం పోరాడుతోంది. రువాండా మద్దతు ఉందని కాంగో ప్రభుత్వం (Congo Government) ఆరోపిస్తున్న ఎం23 గ్రూప్ సహా పలు సంస్థలు దాడులను తీవ్రతరం చేసినట్లు సమాచారం.
జర్మనీలో అమెరికా సైనిక విమానానికి ప్రమాదం
ఇదిలా ఉండగా.. జర్మనీలోని స్పాంగ్‌డాలెమ్ ఎయిర్‌బేస్‌లో(Spangdahlem Air Base) ఈ వారంలో అమెరికా సైనిక విమానం (US Military Aircraft) కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ సమయానికి ఎజెక్ట్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఆయనకు చికిత్స అందించినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవల బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. స్పాంగ్‌డాలెమ్ ఎయిర్‌బేస్‌లో సుమారు 20 ఎఫ్-16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రన్ ఉంది. అమెరికా వైమానిక దళం, నాటో(NATO) కార్యకలాపాల్లో ఈ స్థావరం కీలకంగా పనిచేస్తోంది.







