ముంబైలోని (Mumbai) ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో (IIT Bombay) విషాద ఘటన చోటుచేసుకుంది. పరీక్ష(Exam) సమయంలో మొబైల్ ఫోన్ (Mobile Phone) ఉపయోగిస్తూ పట్టుబడిన 19 ఏళ్ల విద్యార్థి హాస్టల్ గదిలో (Hostel Room) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (Energy Science and Engineering) విభాగంలో 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ ఇటీవల పరీక్ష రాస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాన్ని (Question Paper) చాట్‌జీపీటీకి పంపుతున్న సమయంలో అతడు పట్టుబడినట్లు వెల్లడించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి సాహిల్‌పై (Sahil) ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఐఐటీ బాంబే (IIT Bombay) అధికారులు స్పష్టం చేశారు. విభాగాధిపతి అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఈ వ్యవహారం అతడి భవిష్యత్తు లేదా చదువుపై ఎలాంటి ప్రభావం చూపదని భరోసా ఇచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం హాస్టల్ గదికి వెళ్లిన సాహిల్ సాయంత్రం మృతిచెందిన స్థితిలో కనిపించినట్లు వెల్లడించారు.
సాహిల్ మృతితో ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఏడాది క్యాంపస్‌లో ఇది 4వ మరణం కావడంతో విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరిగింది. వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలపై, సాహిల్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
మరోవైపు, సాహిల్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని, వెంటనే హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేశారని కొందరు విద్యార్థులు (Students) ఆరోపించారు. ఆ ఒత్తిడి కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఐఐటీ బాంబే అధికారులు ఖండించారు. సాహిల్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ఐఐటీ బాంబే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాహిల్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవసరమైన మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు విద్యార్థి మృతికి గల కారణాలపై ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సరికాదని అధికారులు తెలిపారు.








