---Advertisement---

Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏం చెప్పిందంటే?

September 28, 2026

Summarize with AI

---Advertisement---

యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపుపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ప్రశ్నలు సంధించింది. రూ.2,000కు పైబడిన కొన్ని వ్యాపార లావాదేవీలపై ఫీజు(Fee) విధించేందుకు ఉన్న చట్టబద్ధమైన ఆధారం ఏంటని ప్రశ్నించింది. ఈ ఛార్జీల ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వసూలైన మొత్తాన్ని ఎవరెవరికి, ఏ విధంగా పంపిణీ చేస్తారు? అనే వివరాలను కేంద్ర ప్రభుత్వం(Central Government), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి కోరింది.

ఈ ఫీజు విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. అయితే ఛార్జీల అమలుపై వెంటనే స్టే విధించాలని పిటిషనర్ కోరినప్పటికీ, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ తమ అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాతే ఈ అంశంపై తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రస్తుతం యూపీఐ ఛార్జీల (UPI Charges) చట్టబద్ధతపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

కొత్త విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైబడిన కొన్ని వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఫీజు విధించనున్నారు. అయితే వ్యక్తుల మధ్య జరిగే చెల్లింపులు (P2P), రూ.2,000లోపు లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించవు.

రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ఫీజు గరిష్టంగా రూ.300గా పరిమితం చేశారు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ప్రత్యేక రుసుమును నిర్ణయించారు. ఈ రంగాల్లో రూ.2,000కు పైబడిన ప్రతి లావాదేవీపై రూ.5 ఫ్లాట్ ఫీజు విధించనున్నారు.

ఈ కొత్త ఫీజు విధానాన్ని న్యాయవాది అంజన్ దత్తా (Anjan Dutta) సుప్రీంకోర్టులో పిల్ ద్వారా సవాలు చేశారు. సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు, సెప్టెంబర్ 15న ప్రకటించిన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను(MDR Framework) పిటిషన్‌లో సవాలు చేశారు.

తగిన చట్టబద్ధమైన రక్షణలు, పారదర్శకత, ప్రజా సంప్రదింపులు లేకుండానే ఈ ఫీజు విధానాన్ని తీసుకొచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను రద్దు చేయాలని లేదా నిలిపివేయాలని కోరారు. ప్రత్యామ్నాయంగా గణాంకాలు, ప్రభావ అంచనాలను బహిర్గతం చేసి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రక్షణ కల్పిస్తూ ఫీజు విధానాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత ఈ ఫీజుల చట్టబద్ధత, అమలు విధానంపై తదుపరి విచారణ జరగనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment