ఢిల్లీలో(Delhi) మహిళలు(women), బాలికలపై(Girls) వరుసగా నమోదవుతున్న అత్యాచార ఘటనలపై (Rape Incidents) సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరాలకు పాల్పడే వారిలో చట్టం, శిక్షల పట్ల భయం ఏర్పడేలా భద్రతా వ్యవస్థ (Security System) పనిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నేరాలను అరికట్టేందుకు బలమైన నిరోధక చర్యలు అవసరమని పేర్కొంది.
జస్టిస్ జేబీ పార్దీవాలా (JB Pardiwala) నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ-ఎన్సీఆర్లో (Delhi-NCR) ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై సుమోటోగా (Suo Motu) విచారణ చేపట్టింది. మహిళల భద్రతకు (Women’s Safety) సంబంధించి కేంద్రం, ఢిల్లీ పోలీసులను పలు ప్రశ్నలు అడిగింది. సున్నిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉందా? ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించేలా సమర్థవంతమైన విధానం ఉందా? అని ప్రశ్నించింది.
నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరం జరగకుండా ముందుగానే అడ్డుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. రాత్రివేళల్లో మహిళలు రోడ్డుపై నడిచినా, మెట్రోలో(Metro) ప్రయాణించినా సురక్షితంగా ఉన్నామనే నమ్మకం కలగాలని పేర్కొంది. ప్రజా ప్రదేశాల్లో భద్రతా లోపాలు నేరాలకు అనుకూల పరిస్థితులను సృష్టించకూడదని స్పష్టం చేసింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో మహిళలు, మైనర్లపై వరుస లైంగిక దాడుల నేపథ్యంలో గత నెలలోనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీసు పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో లైటింగ్(Lighting), సీసీటీవీ కెమెరాల (CCTV Cameras) పరిస్థితిపై ఆడిట్ నిర్వహించాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. మహిళల భద్రతకు సంబంధించిన చర్యల అమలును పర్యవేక్షిస్తూ విచారణను కొనసాగించనుంది.








