భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’(Ramayana) సినిమాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్ నిర్మాత(Producer), ప్రైమ్ ఫోకస్ (Prime Focus) సంస్థ అధినేత నమిత్ మల్హోత్రాకు (Namit Malhotra) సంబంధించిన కార్యాలయాలు, నివాసంపై ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అధికారులు సోదాలు (Raids) నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముంబైలోని నమిత్ మల్హోత్రా నివాసంతో పాటు ప్రైమ్ ఫోకస్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన చార్టర్డ్ అకౌంటెంట్లు(Chartered Accountants), ఆర్థిక సలహాదారుల కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యంగా విదేశీ నిధుల లావాదేవీలు, సంస్థకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై అధికారులు వివరాలు పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఐటీ సోదాలకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో ప్రైమ్ ఫోకస్ షేర్లపై (Shares) కూడా ప్రభావం పడింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సంస్థ షేరు ధర దాదాపు 8 శాతం వరకు క్షీణించినట్లు సమాచారం.
నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ భారీ విజువల్ వండర్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ తొలి భాగం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.







