కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి తెలిపారు. బెయిల్పై విడుదలైన అనంతరం తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్ కుట్రలతోనే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన తనపై కేసులు పెట్టారని, ఓ ఘటనకు సంబంధించిన వీడియోపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంలో తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
వాల్మీకి సామాజిక వర్గంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని విరూపాక్షి విమర్శించారు. వాల్మీకులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ఆరోపిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ వర్గానికి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. తనపై కేసులు నమోదు చేసిన పోలీసుల వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.






