రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలనే కీలక డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో ‘ఛలో పోతిరెడ్డిపాడు’ (Chalo Pothireddypadu) కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని (Rayalaseema Lift Irrigation Scheme) ప్రారంభించారని తెలిపారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దాదాపు రూ.3700 కోట్ల వ్యయంతో పనులు మొదలయ్యాయని వివరించారు.
అంతేకాక, వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించే ప్రయత్నాలు జరిగాయని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం అప్పట్లో పెంచారని గుర్తుచేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఆ సామర్థ్యాన్ని మరింతగా పెంచారని చెప్పారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేశారని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో జరిగిన రహస్య ఒప్పందాలే ఇందుకు కారణమని ఆరోపించారు.
రాయలసీమ ప్రజలకు నీటి హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హంద్రీనీవా విస్తరణతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






