వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు (Ambati Rambabu) కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలు చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై జరిగిన దాడులు అత్యంత హేయమైన చర్యలని వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ (Tirumala Laddu) అంశంపై సీఎం చంద్రబాబు (N. Chandrababu Naidu) ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని జగన్ విమర్శించారు. నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కల్తీ జరగలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా చెప్పాయని గుర్తు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో జరిగిన అన్ని పరీక్షల్లో కూడా కల్తీ లేదని తేలిందన్నారు. అయినప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అబద్ధపు ప్రచారం చేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), నారా లోకేశ్ (Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లెంపలేసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ అంశంపై ప్రశ్నించినందుకే అంబటి రాంబాబుపై దాడి చేశారా అని ప్రశ్నిస్తూ, పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం ఆడే అబద్ధాలు, చేస్తున్న మోసాలపై ప్రజలకు నిజాలు చెప్పే క్రమంలో ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా అంటూ జగన్ ప్రశ్నించారు.






