మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు
తెలంగాణ (Telangana)లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం (Municipal Election Campaign) ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ తొలి వార్డు జ్యోతి నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అడిగితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మహిళలకు ఫ్రీ ప్రయాణం ఇచ్చి, పురుషులపై రెట్టింపు చార్జీలు వేయడమేనా సంక్షేమమని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారని, కానీ ఆ హామీ అమలు కాలేదన్నారు. రైతుబంధు, ఫ్రీ స్కూటీ వంటి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కిట్‌ను తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. పేరు మార్చినా సరే ఆ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు మళ్లీ కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి (Chief Minister) కావాలని కోరుకుంటున్నారని, జ్యోతి నగర్ అభివృద్ధిలో ఏమైనా లోపాలుంటే క్షమించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే జ్యోతి నగర్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. హామీలు ఇచ్చి అమలు చేయని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం ఇదేనని కేటీఆర్ అన్నారు.








