ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Srivari Laddu) వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయ ప్రసాదాల స్వచ్ఛతపై జరుగుతున్న రాజకీయ వివాదాల మధ్య, కర్నూలు పర్యటనలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐదేళ్ల పాటు ఆలయాల్లో పంపిణీ చేసిన ప్రసాదాల్లో కల్తీ నెయ్యి ఉపయోగించారని అన్నారు.
తిరుమల లడ్డూల తయారీలో బాత్‌రూమ్ (Bathrooms)లు శుభ్రం చేయడానికి వాడే కెమికల్స్ (Cleaning Chemicals), కూరగాయల్లో ఉపయోగించే రసాయనాలు కలిపారని చంద్రబాబు ఆరోపించారు. శ్రీశైలంలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉందని చెప్పారు. ణ్డ్డ్భ్ నివేదిక ఆధారంగానే ఈ విషయాలు వెల్లడిస్తున్నానని, రిపోర్ట్‌లో ఎనిమల్ ఫ్యాట్ ఉందని తేలితే అదే నిజమని స్పష్టం చేశారు.
లడ్డూల రుచి గతంతో పోలిస్తే మారిందా లేదా అన్నది ప్రజలే ఆలోచించాలని ఆయన ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని అడిగితే తప్పేనా అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. సీబీఐ, సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ, కల్తీ జరిగినట్టు సిట్ నివేదికలో ఉందని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇక, గతంలో తీవ్రవాదుల దాడుల్లో తనపై 24 క్లేమోర్ మైన్స్ పేల్చిన సందర్భాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, వెంకటేశ్వర స్వామి దయవల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై అనవసర ఆరోపణలు చేశారని, ఇప్పుడు అపాలజీ అడగడం సరికాదని మండిపడ్డారు. అలాగే గుంటూరు–విజయవాడ మధ్య ప్రయాణానికి ఆరు గంటలు పడుతోందని, రోడ్లపై రౌడీయిజం, గుండాయిజం పెరిగిందని తీవ్రంగా విమర్శించారు.






