వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రవివర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించడం, పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించడం, రోడ్లు బ్లాక్ చేయడం ద్వారా సామాన్యులకు ఇబ్బందులు కలిగించారని పోలీసులు ఆరోపించారు. అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించడం వంటి కారణాలతో బీఎన్‌ఎస్ చట్టం, పోలీస్ యాక్ట్, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూడా జోగి రమేష్‌పై మరో కేసు నమోదైంది. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలతో ఈ కేసు పెట్టారు.
జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్, రమేష్ ఇంటికి వెళ్లగా, పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.






