“కాక్రోచ్ జనతా పార్టీ”(Cockroach Janata Party) వివాదంపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ (Suryakant) సోమవారం తిరస్కరించారు. “దీనిని అంత భావోద్వేగంగా తీసుకోవద్దు” అంటూ వ్యాఖ్యానించిన సీజేఐ(CJI).. ఈ వ్యవహారంలో తక్షణ విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు. సరైన సమయంలో పిటిషన్లను విచారణకు తీసుకుంటామని తెలిపారు.
సుప్రీంకోర్టులో (Supreme Court) జరిగిన విచారణ సందర్భంగా అడ్వకేట్ ఎన్కే గోస్వామి(NK Goswami) కోర్టు దృష్టికి కీలక అంశాలను తీసుకెళ్లారు. సీజేఐ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చినా.. సోషల్ మీడియాలో ఇప్పటికీ వక్రీకృత ప్రచారం కొనసాగుతోందని ఆయన తెలిపారు. దీనికి స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. “ఇది అత్యవసరంగా విచారించాల్సిన అంశం కాదు” అని పేర్కొన్నారు.
ఈ వివాదానికి మూలం మే 15న జరిగిన ఓ విచారణలో సీజేఐ చేసిన వ్యాఖ్యలే. “వ్యవస్థపై దాడులు చేసే కొందరు యువకులు ఉద్యోగాలు లేక.. వృత్తుల్లో స్థానం లేక కాక్రోచ్లలా (Cockroaches) మారుతున్నారు. కొందరు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా (RTI Activists) మారి అందరినీ విమర్శించడం ప్రారంభిస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య ఉద్యమం ప్రారంభమైంది. నిరుద్యోగం(Unemployment), పరీక్షల పేపర్ లీకులు(Exam Paper Leaks), పాలన వైఫల్యాలపై (Governance Failures) మీమ్స్, పోస్టులు వైరల్‌గా మారాయి. విమర్శలు పెరగడంతో అనంతరం సీజేఐ వివరణ ఇచ్చారు. “దేశ యువతను విమర్శించలేదు. నకిలీ డిగ్రీలతో (Fake Degrees) న్యాయవృత్తిలోకి వచ్చిన వారినే ఉద్దేశించి మాట్లాడాను” అని స్పష్టం చేశారు.
ఇదే అంశానికి సంబంధించిన మరో పిటిషన్ కూడా సోమవారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కోర్టు మౌఖిక వ్యాఖ్యలను డబ్బు ఆర్జనకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని, నకిలీ న్యాయవాదులపై దర్యాప్తు జరపాలని పిటిషన్లో కోరారు. అయితే ఆ పిటిషన్‌ను కూడా అత్యవసరంగా విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
మీడియా కథనాల ప్రకారం “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమాన్ని మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) అనే యువకుడు ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడు రూపొందించిన సోషల్ మీడియా ఖాతాలు కొద్ది రోజుల్లోనే లక్షలాది ఫాలోవర్లను సంపాదించాయి. అనంతరం ఆ ఖాతాల్లో కొన్ని భారత్‌లో నిలిపివేయబడ్డాయి. జాతీయ భద్రతకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు తన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్ హ్యాక్ అయ్యాయని అభిజీత్ దిప్కే ఆరోపించాడు.
ఈ వివాదం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్రంగా ట్రెండ్ అవుతుండటంతో ఎలాంటి గుంపులు చేరకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా 24 గంటల భద్రత ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్ తెలిపారు. ఇది ప్రత్యేక బెదిరింపుల కారణంగా కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.







