---Advertisement---

కూటమి పాలనలో కూల్చివేతలు మితిమీరుతున్నాయా?

May 25, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనుల కంటే కూల్చివేతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందా అనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు, నేతల ఇళ్లు లక్ష్యంగా బుల్డోజర్లు దూసుకెళ్లడం రాజకీయ కక్షసాధింపులకే నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ పరిణామాలు ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి.

అయితే ఈ కూల్చివేతలు కేవలం రాజకీయ ప్రత్యర్థులకే పరిమితం కాలేదనే విమర్శలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గుడి, బడి అని కూడా చూడకుండా నిర్మాణాలను నేలమట్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే అధికార పార్టీకి చెందిన ఎంపీనే “సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతోంది” అని వ్యాఖ్యానించాల్సిన స్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కడప జిల్లా జ్యోతి మండలంలోని ప్రసిద్ధ అవధూత కాశినాయన ఆశ్రమం కూల్చివేత పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. అలాగే ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేతపై కూడా భక్తులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడ భవానీపురంలో నలభైకి పైగా ఇళ్ల కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బాధితులకు మద్దతుగా నిలిచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇక శాతవాహన కాలేజీ కూల్చివేత వ్యవహారం కూడా రాజకీయ దుమారానికి కారణమైంది. తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజా ప్రోత్సాహంతోనే అధికారులు ఈ చర్యలకు దిగారనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు మచిలీపట్నం, శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూడా స్థానిక నేతల ప్రోత్సాహంతో కూల్చివేశారనే ఆరోపణలు కూటమి పార్టీల మధ్యే విభేదాలను బయటపెట్టాయి.

అంతేకాక డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆదేశాలతో తన ఇల్లు, కార్యాలయాలను కూల్చివేశారని టీడీపీ సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరావు ఆరోపించడం కూటమిలో అంతర్గత విభేదాలపై కొత్త చర్చకు తెరలేపింది. అధికార కూటమిలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కూల్చివేతలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇటీవల విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం “మత్స్య దర్శిని”ని లీజు వివాదం పేరుతో జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే గత కొద్ది రోజుల ముందు విశాఖలో ప్రముఖ ఫుడ్ కోర్టుని త్వలగించడమూ వివాదం అయింది. ఈ ఘటనలతో ప్రభుత్వం అభివృద్ధి కంటే కూల్చివేతల రాజకీయానికే ప్రాధాన్యత ఇస్తోందా అనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. గుడి, బడి, ఇల్లు అన్న తేడా లేకుండా నిర్మాణాలను నేలమట్టం చేయడం ప్రజల్లో భయాందోళనలు పెంచుతోందని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment